ముగించు

నవరత్నాలు

NAVARATNALU

పింఛన్ల పెంపు

ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఏటా రూ.24,000 నుంచి రూ.48,000 వరకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం పింఛన్‌ తీసుకోవ డానికి ఉన్న వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తారు. అవ్వతాతలకు నెలకు రూ.2000, ఇస్తూ దానిని రూ.3 వేలకు పెంచుకుంటూ పోతాము.  దివ్యాంగులకు రూ.3000 పింఛన్‌ అందిస్తారు.

పేదలందరికీ ఇళ్లు

ఈ పథకం వల్ల ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల నుంచి 5 లక్షల వరకూ ప్రయోజనం చేకూరుతుంది. ఇల్లులేని పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తారు. ఐదేళ్లలో 25లక్షల పక్కా ఇళ్లు కట్టాలన్నది లక్ష్యం. ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని అక్కచెల్లెమ్మ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేస్తారు. అవసరమైతే ఆ ఇంటి మీద పావలా వడ్డీకే బ్యాంకులో రుణం ఇప్పిస్తారు

వైయ‌స్ఆర్‌ ఆసరా

ఈ పథకం కింద వచ్చే ఎన్నికల రోజు వరకు ఉన్న పొదుపు సంఘాల రుణం మొత్తాన్ని నాలుగు దఫాలుగా అక్కచెల్లెమ్మల చేతికే నేరుగా ఇస్తారు. అంతేకాకుండా సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తారు. ఆ వడ్డీ డబ్బును ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది. దీనివల్ల ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.50 వేల వరకు ప్రయోజనం చేకూరుతుంది. అదేవిధంగా వైఎస్సార్‌ చేయూత ద్వారా 45 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు పింఛన్లు ఇస్తారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి నాలుగేళ్లలో రూ.75 వేలు దశలవారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా అందిస్తారు.

అమ్మఒడి

పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు అమ్మఒడి పథకం ద్వారా అందిస్తారు. ప్రతి తల్లి తన పిల్లలను సంతోషంగా స్కూల్ పంపడానికి, బాలల భవిష్యత్తుకు మంచి పునాది ఏర్పాటు చేయడమే ఈ పథకం లక్ష్యం

జలయజ్ఞం

లక్షలాది రైతు కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. పోలవరం సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతుల లోగిళ్లలో సిరులు నింపుతారు.

ఆరోగ్యశ్రీ

ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి కుటుంబానికి ఏటా రూ.1 లక్ష నుంచి రూ.10 లక్షల వరకూ మేలు జరుగుతుంది అంచనా. వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తారు. ఎన్ని లక్షలు ఖర్చయినా  ఆరోగ్యశ్రీ ద్వారానే ఉచిత వైద్యం అందిస్తారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైతో పాటు ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్య శ్రీ వర్తిస్తుంది. అన్ని రకాల వ్యాధులు, ఆపరేషన్లను దీని పరిధిలోకి తెస్తారు. ఆపరేషన్‌ చేయించుకున్న లేదా జబ్బు చేసిన వ్యక్తికి చికిత్స తర్వాత విశ్రాంతి సమయంలో ఆర్థిక చేయూతనందిస్తారు. కిడ్నీవ్యాధి, తలసేమియాతోపాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ప్రతినెలా రూ.10 వేలు పింఛన్‌ ఇస్తారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌

పేదవాడి చదువుకయ్యే ఖర్చును ప్రభుత్వం పూర్తిగా భరిస్తుంది. దీని ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.1 లక్ష నుంచి రూ. 1.50 లక్షల వరకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ మొత్తం కాకుండా విద్యార్థులకు వసతి, భోజనం కోసం ఏటా అదనంగా రూ. 20 వేలు ఇస్తారు.

వైయ‌స్ఆర్‌ రైతు భరోసా

ఈ పథకంతో రైతన్న కుటుంబానికి ఏటా రూ.12,500 నుంచి రూ.లక్ష వరకూ ప్రయోజనం ఉంటుంది. ఉచిత బోర్లు వేయించడం, ఉచిత విద్యుత్‌ అందించడం, సున్నావడ్డీకి రుణాలు, రైతులు వాడే ట్రాక్టర్లపై రోడ్‌ ట్యాక్స్‌ మాఫీ ఇందులో వర్తించే అంశాలే.  ప్రభుత్వం ఏర్పడ్డ రెండో ఏడాది నుంచి మే నెలలో పెట్టుబడి కోసం ఏడాదికి రూ.12,500 చొప్పున వరుసగా నాలుగేళ్లు అందిస్తారు. వ్యవసాయానికి పగలే 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తారు. ఆక్వా రైతులకు కరెంట్‌ చార్జీలను యూనిట్‌కు రూ.1.50కు తగ్గిస్తారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.4 వేల కోట్లతో ప్రకతి వైపరీత్యాల సహాయ నిధి ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, అవసరమైతే ఆహారశుద్ధి యూనిట్లను ఏర్పాటు చేస్తారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరుద్ధరించి.. రెండో ఏడాది నుంచి సహకార డైరీలకు పాలుపోసే పాడి రైతులకు లీటర్‌కు రూ.4 సబ్సిడీ ఇస్తారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వైఎస్సార్‌ బీమా ద్వారా రూ.5 లక్షలు చెల్లిస్తారు. ఆ మొత్తాన్ని అప్పులవాళ్లు తీసుకోకుండా చట్టం చేస్తారు.

మద్యం నిషేధం

మూడు దశల్లో రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలపై నిషేధం విధించనున్నట్లు వైయస్‌ఆర్‌సిపి హామీ ఇచ్చింది.