ముగించు

చరిత్ర

ఒంగోలు పేరు గురించి

ఒంగోలు కి ఆ పేరెలా వచ్చింది అనేదాని గురించి ఒంగోలు పరిసర ప్రాంతాల్లో జనం చెప్పే కథ ఒకటుంది. ఇప్పుడున్న ఒంగోలు కి ఆగ్నేయంగా 8 కిలోమీటర్ల దూరంలో ఎండ్లూరు గ్రామం ఉంది. క్షత్రియులైన ఎండ్లూరు రాజులకు కోట కూడా ఉండేది.  వీళ్లకు ఇప్పటి ఒంగోలు ప్రాంతం వేట స్థలంగా ఉండేది. ముఖ్యంగా కొత్త పట్నం  సముద్రతీరానికి వెళుతూ ఇక్కడ వేటాడుతూ ఉండేవాడు. ఒకరోజు ఇక్కడ ఎండ్లూరు రాజులు కుందేళ్ళను వేటాడుతుండగా, అవి వాటిని పట్టుకోవడానికి వచ్చిన వేటకుక్కలకి ఎదురుతిరిగి వాటినే తరిమికొట్టేయి. ఈ కుందేళ్ళ ధైర్యం, తెగువ ఆకర్షితులైన ఎండ్లూరు రాజులు ఆ ప్రాంతంలో కోట కట్టి అక్కడే తమ రాజధాని నెలకొల్పాలి నిర్ణయించుకున్నారు. కుందేళ్ళ ధైర్యానికి గుర్తుగా వంగని ప్రోలు  అని పేరు పెట్టారు. సుమారుగా 1620 ప్రాంతంలో ఇక్కడ వాళ్ళు ఒక కోటను కూడా నిర్మించారు ‘వంగని ప్రోలు’ కాలక్రమేణా ‘వంగవోలు’గా తర్వాత ఇప్పటి ఒంగోలు గా నామాంతరం చెందింది

చారిత్రక అంశాలు

జిల్లాలోని దొనకొండ మండలం చందవరంవద్ద బౌద్ధారామం వ్యాప్తిచెందింది. త్రిపురాంతకం మండలంలో వెల్లంపల్లి గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరాన గుండ్లకమ్మ నది ఒడ్డున వెలసిన ఈ బౌద్ధారామం అతి పురాతనమైనది.1965లో జరిగిన తవ్వకాల్లో ఇది బయటపడింది. ఇదే తవ్వకాల్లో ఆరు అరుదైన శిలాఫలకాలు, మూడు బంగారు పుష్పాలు దొరికాయి. వీటన్నింటినీ పురావస్తుశాఖ రాజధానికి తరలించింది. 1972 సంవత్సరంలో నాలుగు దఫాలుగా పురావస్తుశాఖ తవ్వకాలు జరపడంతో ఇక్కడ వందల చిన్నస్థూపాలు, 15 పెద్ద స్థూపాలు బయటపడ్డాయి. 710శతాబ్ధంలో ఆది శంకరుడు దక్షిణ భారత యాత్ర చేసిన సందర్భంగా బౌద్ధ ధర్మం, స్థూపాలు క్షీణించడంవల్ల ఈ స్థూపాలకు చెందిన ఇటుకలు, శిలలు, శిల్పాలు చందవరానికి చెందిన మహాబలేశ్వరాలయంలో నిర్మాణానికి ఉపయోగించి ఉండవచ్చని భావిస్తున్నారు. నాగులుప్పలపాడు మండలంలోని కనపర్తి గ్రామంక్రీస్తు పూర్వం బౌద్ధ రామంగా ఆ తర్వాత శైవ క్షేత్రంగా కనపర్తి ప్రసిద్ధి పొందింది. కాకతీయులు, చోళరాజుల పాలనలో దినదిన ప్రవర్థమానమయ్యింది. ఈ ప్రాంతాన్ని 17వ శతాబ్ధంలో మహ్మద్ ఘోరీ పాలించినట్లుకూడా ఆధారాలున్నాయి. ఒకప్పుడు కనకాపురిగా, కనకజంభనపురిగా ప్రసిద్ధిగాంచిన నేటి కనపర్తి గ్రామం పిలవబడుతోంది. ఈ ప్రాంతంలో బయలుపడిన శిల్పాలు అమరావతి శిల్పాలుకంటే అపురూపమైనవి.పల్నాటి చరిత్రకు త్రిపురాంతకం మండంలంలోని మేడపి గ్రామం అద్దం పడుతోంది. కోడి పందాల్లో ఓడిపోయిన బ్రహ్మనాయుడు పందెం ప్రకారం రాజ్యం వదిలి వచ్చినప్పుడు ఆయన నివశించిన ప్రాంతమే ఈ మేడపి గ్రామం. త్రిపురాంతకం వచ్చి అక్కడ సమీపంలో ఉన్న మేడిచెట్లను కొట్టేసి గ్రామాన్ని నిర్మించడంతో మేడపిగా పేరొచ్చింది. ఆ గ్రామంలో బ్రహ్మనాయుడు చెన్నకేశవస్వామి ఆలయాన్ని నిర్మించాడు. బ్రహ్మనాయుడే స్వయంగా చెన్నకేశవుని విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్టించినట్లు చెబుతారు. చినగంజాం మండలంలో ఉన్న మోటుపల్లి  గ్రామం ఒకనాడు ప్రముఖ వర్తక కేంద్రం .ఇక్కడ రతనాలు ముత్యాలు వీధుల్లో రాశులుపోసి అమ్మకాలు చేసేవారు. గ్రామానికి పూర్వం ముకులపురం, పూసలపురం అనే పేర్లు ఉండేవి. హెస్టారిస్ అనే గ్రీకు నావికుడు తన రచనలో పేర్కొన్న మెసోలియా పట్టణమే నేటి మోటుపల్లి గ్రామం అయి ఉండొచ్చని పరిశోధకులువిశ్వసిస్తున్నారు. ఒకనాటి కనికిరి పట్టణమే నేడు కనిగిరిగా పిలవబడుతున్నది. ఇది ఒక్కప్పుడు పల్లవ చోలరాజులు, కాకతీయులు, యాదవులు, రెడ్డిరాజులు గజపతులు, విజయనగరాధీశులు, నవాబులు, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు, జమిందారుల ఏలుబడిలో ఉన్నట్లు చారిత్రాత్మక ఆధారాలున్నాయి. కనిగిరిని ఆనుకుని రెండు ఎత్తయిన కొండల మధ్య అభేధ్యమైన కోటను నిర్మించుకుని ఆనాటి రాజులు పాలన సాగించారు.

ప్రముఖులు

ప్రఖ్యాత వ్యక్తుల జన్మస్థలం ఇక్కడి ప్రాంతమే. ప్రపంచ ప్రఖ్యాత ఇంజినీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూర్వీకుల స్వస్థలం నియోజకవర్గంలోని బేస్తవారపేట మండలం మోక్షగుండం. ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగరాజు పూర్వీకుల స్వగ్రామం అర్థవీడు మండలం కాకర్ల.

టంగుటూరి ప్రకాశం

ప్రకాశం పంతులు జన్మస్థలం నాగులుప్పలపాడు మండలం వినోదరాయునిపాలెం. ఆయన 1872 ఆగస్టు 23న టంగుటూరి గోపాలకృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు.చిన్నతనంలో తండ్రి మరణించడంతో మేనమామల వద్ద అద్దంకి నాయుడిపాలెంలో పెరిగి ప్రాథమిక విద్య అభ్యసించారు.  మెట్రిక్‌, ఎఫ్‌ఏలో ఉత్తీర్ణత సాధించారు. అనంతరం మద్రాసు లా కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1894 నుంచి రాజమండ్రిలో న్యాయవ్యాదిగా ప్రాక్టీస్‌ ప్రారంభించిన ఆయన అనతికాలంలోనే మంచిపేరు సంపాదించారు. 14ఏళ్లు న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేసిన ఆయన మద్రాస్‌ హైకోర్టులో న్యాయవాదిగా అర్హత పొందడానికి ఇంగ్లాడ్‌ వెళ్లి బారిష్టర్‌ పూర్తి చేశారు. లండన్‌ ఓడలో తొలిసారిగా గాంధీజీని కలసిన ఆయన జాతీయ ఉద్యమాల పట్ల ఆకర్షితులయ్యారు. స్వతంత్రం పూర్వం నాలుగు పర్యాయాలు రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ముఖ్యమంత్రిగా, కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన సేవలు అందించారు. దేవరంపాడు వద్ద జరిగిన సత్యాగ్రహ శిబిరాన్ని అప్పటి స్వతంత్ర ఉద్యమ నాయకులు కొండా వెంకటప్పయ్య, దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు, నాటి జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడు డాక్టర్‌ బాబు రాజేంద్రప్రసాద్‌, జలగం వెంగళరావు తదితరులు సందర్శించారు. స్వరాజ్య పత్రికను స్థాపించి జాతీయ భావాలను దేశవ్యాప్తంగా విస్తరింపజేశారు. ఆయన 20 మే 1950లో మరణించారు.

దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

చీరాల, పేరాల ఉద్యమంతో ఈప్రాంత ప్రజలకు పోరాట స్ఫూర్తిని అందించిన ఘనత దుగ్గిరాల గోపాలకృష్ణయ్యకే దక్కుతుంది. 1921లో పన్నుల పెంపుదలను నిరసిస్తూ ప్రజలను సంఘటితపరచి రెండు గ్రామాలు మొత్తం ఖాళీ చేయించి రామ్‌నగర్‌ వద్ద నివాసాలు ఏర్పాటు చేయించారు. స్వతంత్ర పోరాట చరిత్రలోనే ఇది అత్యంత అరుదైన ఘటనగా నిలిచింది..  ఈకాలం భారతదేశంలోనే తొలిస్వయంపాలిత ప్రాంతంగా దీనిని చరిత్ర గుర్తించింది.దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 1921 సెప్టెంబర్‌లో బరంపూర్‌ వెళ్లి మేజీస్ట్రేట్‌ ఉత్తర్వులు ధిక్కరించి ప్రసంగించిన తెగువరి. అంతటి మహనీయునికి నివాళిగా చీరాలలో గోపాలకృష్ణయ్య పార్కు ఏర్పాటు చేశారు. ఇప్పటికి పట్టణంలో ప్రధానమైన పార్కు ఇదే.

షేక్ చినమౌలానా

కరవది గ్రామానికి పద్మశ్రీ షేక్‌ చినమౌలానా సాహెబ్‌ ప్రముఖ నాదస్వర విద్వాంసుడిగా ఖ్యాతి గడించారు. ఈయన 1972లో ఆనాటి ఉపరాష్ట్రపతి బి.డి.జెట్టి నుంచి పద్మశ్రీ పురస్కారం, 1985లో శంకర్‌దయాళ్‌ శర్మ నుంచి కళాప్రపూర్ణ బిరుదులతోపాటు పలు అవార్డులు సొంతం చేసుకుని జిల్లా కీర్తిని ఇనుమడింపజేశారు.

  భానుమతి రామకృష్ణ

తెలుగునాట ఖ్యాతి గాంచిన నట విదుషీమణి భానుమతి మద్దిపాడు మండలం దొడ్డవరం గ్రామవాసే. ఆసియా ఖండంలోనే మొదటి స్డూడియో అధిపతిగా, దర్శకురాలిగా ఖ్యాతి కెక్కిన మహిళ. ఆమె మొత్తం 35 కళాత్మక చిత్రాలు రూపొందించారు. కలైమామణి, పద్శశ్రీ పురస్కారాలు ఈమెను వాటంతటవే వరించి వచ్చాయి.

  డి.రామానాయుడు

దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్‌ దగ్గుపాటి రామానాయుడు కారంచేడు నివాసి. అలనాడు ఎన్టీఆర్‌, జమునలతో శ్రీకృష్ణ తులాభారం నిర్మించినా. అక్కినేని, వాణిశ్రీలతో ప్రేమ్‌నగర్‌ రూపొందించినా , అది రామనాయుడికే సొంతమైంది. దేశంలోని అన్ని భాషల్లో చిత్రాలు తీసిన ఈ మూవీ మొఘల్‌కు పురిటిగడ్డ కారంచేడు,

దరిశి చెంచయ్య

దరిశి చెంచయ్య కనిగిరికి చెందిన సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు. 1913లో అమెరికాలోని లోగోస్‌ విశ్వవిద్యాలయం నుంచి వ్యవసాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. 1913లో గదర్‌ పార్టీలో చేరి బర్మాను ఆక్రమించి ఆంగ్లేయులను దెబ్బతీసేందుకు, ఓడలో తుపాకులు, కొంతమంది విప్లవకారులతో బయల్దేరాడు. అయితే నమ్మకద్రోహం వల్ల వారిచేతికి చిక్కి నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించారు. ఈయన విడుదలైన తరువాత దేశభక్త కొండా వెంకటప్పయ్యగారి అధ్యక్షతన గుంటూరులో ఘన సన్మానం జరిపారు. ఈయన రాసిన నేను-నా దేశం పుస్తకం బహుళ ప్రాచుర్యం పొందింది.