ముగించు

ముఖ్య ప్రణాళికా అధికారి

ముఖ్య ప్రణాళికా అధికారి

ప్రణాళిక శాఖ నిర్వహించు కార్యక్రమములు

ప్రణాళిక శాఖ రెండు విధములైన కార్యక్రమములను నిర్వహించును. 1. ప్లానింగ్ 2. గణాంక కార్యక్రమములు.

ప్లానింగ్:-

పార్లమెంట్ సభ్యుల యొక్క అభివృద్ధి నిధులు (యం.పి.లాడ్స్)

ప్రజలు పార్లమెంట్ సభ్యులను కలుసుకొని వారికి కావలసిన ప్రాధమిక అవసరములు తెలియజేసి వాటిని కల్పించవలసినదిగా కోరెదరు.

ఈ కార్యక్రమము యొక్క ప్రధాన ఉద్దేశ్యము అభివృద్ధి పనులను ముఖ్యముగా సమాజమునకు ఉపయోగపడి ప్రజల అవసరములకు అనుగుణంగా ఆస్తులను ఏర్పాటుచేయుట. పార్లమెంట్ సభ్యులు వారి నియోజకవర్గములలో ప్రాధాన్యత క్రమముగా త్రాగునీరు, ప్రాధమిక విద్య, ప్రజారోగ్యము, పారిశుధ్యము మరియు రోడ్లు వంటి కార్యక్రమములకు నిధులు కల్పించెదరు.యం.పి.లాడ్స్ ఒక ప్రణాళిక పథకము మరియు అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులపై ఆధారపడి ఉన్నది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గమునకు ఒక సంవత్సరమునకు 5 కోట్లు మంజూరు చేయబడును.

గణాంక కార్యక్రమములు:

 1. వ్యవసాయ గణాంకాలు
 2. పారిశ్రామిక గణాంకాలు
 3. ధరల గణాంకాలు
 4. అధికారిక గణాంకాలు
 5. జిల్లా స్థూల ఉత్పత్తి
 6. ఆర్ధిక సామాజిక సర్వే
 1. వ్యవసాయ గణాంకాలు

  వ్యవసాయ గణాంకాలు ఈక్రింది విధముగా విభజించవచ్చును.వర్షపాత గణాంకాలు, భూ వినియోగం మరియు విస్తీర్ణాలు, వివిధ రకముల పంటలకు సంబంధించిన దిగుబడి గణాంకాలు.

  a)వర్షపాత గణాంకాలు

  దినసరి వర్షపాత నివేదికలు ప్రతి మండలము నుండి సేకరించి ప్రభుత్వమునకు పంపబడును. ప్రతి బుధవారము వారాంతపు వర్షపాతము నివేదికలు తయారుచేసి ప్రతి గురువారము ప్రభుత్వమునకు పంపబడును.

  b)విస్తీర్ణ గణాంకాలు

  వ్యవసాయ గణాంకాలలో భూ వినియోగమును ప్రతి గ్రామము నుండి రాష్ట్రము వరకు అన్ని విధములుగా వినియోగించిన భూమిని కలుగుట ద్వారా లెక్కించబడును.భూ వినియోగములను 9 రకములుగా విభజించుట ద్వారా గణించబడును.

  1. అడవులు
  2. చౌడ భూములు మరియు సాగుకు పనికిరాని భూములు
  3. వ్యవసాయేతరములకు ఉపయోగించిన భూములు
  4. సాగుచేయుటకు వీలుగా నుండి నిరుపయోగముగానున్న భూములు
  5. శాశ్వత పచ్చిక బీళ్ళు మరియు ఇతర మేత బీళ్ళు
  6. నాటబడిన విస్తీర్ణంలో చేరని వివిధ వృక్షములు మరియు తోపులు
  7. ఇతర పడావా భూములు
  8. ప్రస్తుత పడావా భూములు
  9. సాగుచేయబడిన నికర విస్తీర్ణం

  భూ వినియోగ సమాచారమును ప్రతి ఖరీఫ్ మరియు రబీ సీజన్ల చివరిలో ఖరారు చేయబడును.
  “నిర్ణీత సమయములో సేకరించు వ్యవసాయ గణాంకాలు (టి.అర్.ఏ.యస్.) ద్వారా శాంప్లింగ్ పద్దతులను ఉపయోగించి పంట విస్తీర్ణములను మరియు దిగుబడులను అంచనా వేయబడును. పంటల అంచనా నివేదికలను కొన్ని ముఖ్యమైన పంటలకు తయారు చేయబడును.

  c)పంటల దిగుబడి గణాంకాలు

  i)ఆహార మరియు ఆహారేతర పంటలు

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ఒక హెక్టారునకు సగటు దిగుబడి అంచనా వేయుటకు ముఖ్యమైన ఆహార మరియు ఆహారేతర పంటలకు ఖరీఫ్ మరియు రబీ సీజన్లలో పంటకోత ప్రయోగములు నిర్వహించబడుచున్నవి. ప్రస్తుతము ఈ పంట కోత ప్రయోగములలో 11 ప్రధానమైన పంటకోత ప్రయోగములు జరుపబడుచున్నవి. అవి వరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగి, కొర్ర, కంది, పెసర, మినుము మరియు శనగ. 10 ప్రధానమైన ఆహారేతర పంటలపై కూడా ఈ పంటకోత ప్రయోగములు నిర్వహించబడుచున్నవి అవి వేరుశనగ, నువ్వులు, ఆముదాలు, ప్రొద్దుతిరుగుడు, మిరప, ప్రత్తి మరియు పొగాకు.గణాంక మరియు వ్యవసాయశాఖలు ఈ పంటకోత ప్రయోగములు నిర్వహించుచున్నవి. మరియు ఈ పంటకోత ప్రయోగములు 50:50 నిష్పత్తిలో ఈ రెండు శాఖలు నిర్వహించుచున్నవి.

  (ii)పంటల భీమా పధకము (PMFBY(VIS))

  ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన రైతులకు సహాయపడుటకై గౌరవనీయులు ప్రధానమంత్రి గారిచే 2016, జనవరి, 13న ప్రారంభిచబడినది.
  గౌరవనీయులు ప్రధానమంత్రి ఈ పథకమును రైతులకు అతి తక్కువ ప్రీమియంతో అందించినారు. రైతులకు ఆర్ధిక బరోసా ఈ పధకము క్రింద లభించుచున్నది. ప్రకృతి వైపరీత్యములు సంభవించినపుడు మాత్రమే ఈ పధకమునకు అర్హులు అగుదురు. ఈ పథకము క్రింద ఖరీఫ్ సీజన్.లో వరి మరియు రబీ సీజన్.లో శనగ పంటలకు పంటల భీమా లభించుచున్నది.

 2. పారిశ్రామిక గణాంకాలు:

  పారిశ్రామిక గణాంకాలు రెండు విధములుగా యున్నవి. వ్యవస్థీకృత పారిశ్రామిక రంగం మరియు అవ్యవస్థీకృత పారిశ్రామిక రంగం.
  వ్యవస్థీకృత పారిశ్రామిక రంగం క్రింద సెక్షన్స్ పారిశ్రామిక చట్టం, 1948 2M (i) మరియు 2M (ii)లో రిజిస్టర్ అయిన పరిశ్రమలు వచ్చును. అవ్యవస్థీకృత పారిశ్రామిక రంగం క్రింద మిగిలిన అన్ని గృహ మరియు గృహేతర తయారీ యూనిట్లు వచ్చును.

  1. వార్షిక ప్రారిశ్రామిక సర్వే (ASI)
  2. వార్షిక ప్రారిశ్రామిక సర్వే (ASI) యొక్క ప్రధాన ఉద్దేశ్యం జాతీయ ఆదాయములో రిజిస్టర్ అయిన ఉత్పత్తి రంగం యొక్క వాటాను అంచనా వేయుట మరియు పారిశ్రామిక గణాంకముల కొరకు ఒక ఆధారమును ఏర్పాటుచేయుట.

  3. పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (IIP)
  4. ఎంపిక చేసిన కర్మాగారముల నుండి ప్రతి మాసమునకు ఉత్పత్తి సమాచారమును బట్టి 1999-2000 బేస్ ఇయర్ నకు పారిశ్రామిక ఉత్పత్తి నెలవారీగా గణించుబడుచున్నది

 3. ధరలు మరియు కూలీల వేతన గణాంకాలు:

  రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థలో ధరలు ద్రవ్యోల్బణం మరియు ఆదాయ వ్యయములను పర్యవేక్షించుటకు ధరలు చాలా ప్రాముఖ్యత కలిగియున్నవి. ధరలను పర్యవేక్షించుటకు ఉత్పత్తి దారుల వద్ద, టోకు మరియు చిల్లర స్థాయిలలో ధరలను సేకరించవలసియున్నది.

  1. ధరల గణాంకాలు ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగుల జీతములను నిర్ణయించుటకు ఉపయోగపడుచున్నది.
  2. ధరల సమాచారము నిత్యావసర వస్తువుల ధరలను అదుపుచేయుటకు అవసరమైయున్నది.
  3. ధరల సమాచారము వాణిజ్య నిబంధములను రుపొందించుటకు అవసరమైయున్నది.
  4. ద్రవ్యోల్బణం మరియు ప్రతి ద్రవ్యోల్బణంను సరిచేయుటకు ధరల సమాచారము ఉపయోగపడుచున్నది.
  5. ధరల సమాచారము సరైన ధరల నిర్ణయ విధానము రూపొందించుటకు ఉపయోగపడుచున్నది.

  అర్ధగణాంక శాఖ ధరల సేకరణ సంగ్రహం మరియు పరిశీలన వంటి వివిధ రకములైన కార్యక్రమములు నిర్వహించుచున్నది.

  • ధరలు:

   1. రోజు వారీ 6 నిత్యావసర వస్తువుల చిల్లర ధరలు
   2. వారాంతపు 21 నిత్యావసర వస్తువుల చిల్లర ధరలు
   3. 40 వ్యవసాయ పదార్థాల టోకు ధరలు
   4. పంటనూర్పిడి ధరలు (ఖరీఫ్ మరియు రబీ సీజన్లకు).
   5. పశువులు మరియు పాల పదార్దముల ధరలు.
   6. భవన నిర్మాణ వస్తువుల ధరలు.
  • కూలీలు:

   1. వ్యవసాయ మరియు వ్యవసాయేతర కూలీ వేతనాలు
   2. భవన నిర్మాణ కూలీ వేతనాలు
 4. అధికారిక గణాంకాలు:

  జిల్లాలోని అన్ని శాఖలకు సంబంధించిన సమాచారమును సేకరించి జిల్లా గణాంక దర్శిని తయారుచేయబడును. ప్రధానమైన అంశములకు సబంధించి సమాచారమును సేకరించబడును.

 5. ప్రాంతీయ లెక్కలు:

  జిల్లాలోని జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయితీలు మరియు మునిసిపాలిటీల ప్రాంతీయ లెక్కలు సేకరించి వాటి ఆదాయ వ్యయములను నిర్ణీత నమూనాలలో నింపి అర్ధగణాంకశాఖ వారు ఇచ్చిన సాఫ్ట్.వేర్.లో కంప్యూటరీకరించి ఆ సమాచారమును అర్ధగణాంకశాఖ వారికి సమర్పించబడుచున్నది.
  1976వ సంవత్సరములో భారత ప్రభుత్వము నెలకొల్పిన రీజనల్ అకౌంట్స్ కమిటీ వారి ఆదేశముల మేరకు స్థానిక సంస్థలకు సంబంధించిన లెక్కలు తయారుచేయబడుచున్నవి.

 6. జిల్లా స్థూల ఉత్పత్తి:

  జిల్లా స్థూల ఉత్పత్తి జిల్లాలోని ఆర్ధిక అభివృద్ధికి సంబంధించిన సూచికలలో అతి ప్రధానమైనది. జిల్లా స్థూల ఉత్పత్తిని ప్రతి సంవత్సరం 4 దశలలో రాష్ట్ర స్థాయిలో అంచనా వేయుదురు. ఈ అంచనాలు ప్రణాళిక రచనకు, అభివృద్ధిని అంచనావేయుటకు మరియు కేంద్ర ప్రభుత్వ వనరులలో ఏ వాటాలో జిల్లాకు ఎంత కేటాయించవలెనో నిర్ణయించుటకు ఉపయోగపడును.

 7. సామాజిక ఆర్ధిక సర్వే:

  జాతీయ నమూనా సంస్థ (NSSO) 1950 వ సంవత్సరం నుండి వివిధ రకముల శాంపిల్ సర్వేలను జాతీయ ఆదాయము నిర్ణయించుటకు పలు సర్వేలను చేపట్టుచున్నది. ఈ సర్వేలు పలు సామాజిక మరియు ఆర్ధిక విషయములపై నిర్వహించబడును. అవి కుటుంబ వినియోగ ఖర్చులు, మరియు ఉద్యోగం మరియు నిరుద్యోగం, అవ్యవస్థీకృత ఉత్పత్తి, వాణిద్యము మరియు ఇతర సేవలు, గృహ పరిస్థితులు, వికలాంగుల సమాచారము, ఆయుర్ధాయము మరియు ఆరోగ్య సంరక్షణ మరియు విద్య మున్నగు వాటిపై సర్వే నిర్వహించబడును. ప్రతి రౌండు ఒక సంవత్సర కాలములో నిర్వహించబడును దానిని 4 సబ్ రౌండులుగా ఒక్కొక్క సబ్ రౌండ్ 3 నెలల కాలవ్యవధిలో నిర్వహించబడును. కొన్ని సార్లు 6నెలల రౌండ్ చేపట్టబడును.

 8. చిన్నతరహా నీటి వనరుల గణన:

  చిన్నతరహా నీటి వనరుల గణన ప్రతి 5 సంవత్సరములకు ఒకసారి నిర్వహించబడును. ఈ కార్యక్రమము నిర్ణీత ఫారములలో వివిధ సాగునీటి వనరుల సమాచారము సేకరించబడి కంప్యూటరీకరించబడుచున్నది. ఈ గణన ద్వారా వివిధ చిన్న తరహా నీటి వనరుల ద్వారా ఎంత విస్తీర్ణము సాగు అయినది తెలుసుకొనవచ్చును.

 9. ఆర్ధిక గణన:

  ఆర్ధిక గణన ద్వారా వ్యవసాయ రంగం మినహాయించి మిగిలిన అన్ని సంస్థల సమాచారము సేకరించబడును. దీని ద్వారా వ్యవస్థీకృత మరియు అవ్యవస్థీకృత రంగములో పనిచేయువారి సమాచారము సేకరించబడును.

  ఈ సర్వే ద్వారా మాత్రమే అవ్యవస్థీకృత మరియు చిన్న సంస్థల సమాచారము మరియు స్వయం ఉపాధి పొందినవారి సమాచారము సేకరించబడును. ఈ సర్వే ద్వారా యాజమాన్యము, ఉద్యోగుల సమాచారము సీజను వారి వ్యాపారాలు మొదలగు సమాచారము సేకరించబడును.